Sunday, May 08, 2011

తాటి ముంజులు ....

మొన్న తాటి ముంజులూ శీతల పెట్టి లో పెట్టి పంచదార చల్లుకొని తిన్నాను అని మొహం పుస్తకం లో పెట్టాను. చాల మంది "నచ్చలేదు" అని "నొక్కి" మరి చెప్పారు. ఇవాళ ఇంకో ఘనకార్యం చేసాను, జీవితం లో ఇంతకూ ముందు ఎప్పుడు చెయ్యనది. మూడు రోజులు క్రితం నా సహోద్యోగి, తాటి కాయలు ఉన్నాయి తీసుకుంటారా అని అడిగాడు. నేనుఎప్పుడు "తినడం" తప్ప "వలవ లేదు" ఇంకా అతి పెద్ద పని ఏమిచేసాను అనుకుంటే, వాటి తో చేసిన బండి తో ఆ కాలం నాటి "స్కూటీ" లా ఆడాను అని అన్నా. అబ్బే అదేమీ పెద్ద పని కాదండి, "buthcer " కత్తి ఉంటె సులభమే , లేదు అంటే పళ్ళు ఉన్న కత్తితో బంగాళా దుంప చిప్స్ లా చేక్కేయండి అని సలహా ఇచ్చాడు ఆయన. ఇదేదో బావుంది అని చెప్పి, ఓ పదిహేనో, పదహారో కాయలు ఉంటాయి అనుకుంటా, కారులో బస్తా వేయించుకుని ఇంటికి తెచ్చా.

"ఆహా", "ఓహో" అని ఇంట్లోనించి ధ్వని తరంగాలు వచ్చాయి, కాని ఇంట్లో కూరలు కోసే కత్తి తప్ప వేరే "ఆయుధం" లేదు అని అనుమానం వచ్చింది. శ్రీమతి ని అడిగితే మనం "ఒమిరికా" నించి వచ్చినప్పడు కొన్ని కత్తుర్లు
కటార్లు పట్టు కొచ్చాము కదా, ఉన్నాయేమో చూస్తాను అంది. వెదికితే దొరికాయి. ఒక 12 రకాలవి. అన్నిటికి "పళ్ళు" ఉన్నాయి, కాస్త సినిమా స్టైల్ లో వాటి వంక చూసి, ఒక బలమైన పట్టు ఉన్న దానిని తీసా. మొదటి కాయ కొయ్యడానికి సుమారుగా 4 నిమషాలు పట్టింది. పది ml చెమట కూడా పట్టింది. ఆ తరువాత పదమూడో ది కొయ్యడానికి 40 సెకనులు పట్టింది. ఆఖరి దానిలో ముంజు, ముంజు లా కొంచం చెక్కుకు పోయింది తీస్తే, మొదటిది కోసినప్పుడు వచ్చిన గుజ్జు ఎలా ఉంటాడో ఊహించ గలరు. గణితం ప్రకారం "inversely proportional " అని తేలింది. ఒకటి కి రెండు సార్లు చేస్తే ఏది అయినా సాధ్యమే అని మనసులో అనుకున్నాను.

కొండ ని తవ్వు ఎలుక ని పట్టు అన్నట్లు, ఆ బస్తా కాయలు అన్ని వలిస్తే, ఒక చిన్న బౌల్ లోకి సరిపడే అంత వచ్చాయి, ముంజులు. చెత్త మాత్రం ఒక వారం చేసే పచారి సామానం పట్టేటి అంత ప్లాస్టిక్ బ్యాగ్గు లో వచ్చింది. పాపం రోడ్డు మీద అమ్మే వాళ్ళు ఎంత కాస్త పడితే ఒక ముంజు బుట్ట లోకి వస్తుంది....

"మొన్న తాటి ముంజులూ శీతల పెట్టి లో పెట్టి పంచదార చల్లుకొని తిన్నాను అని మొహం పుస్తకం లో పెట్టాను.".... ఇది మళ్ళా రాయాలి అంటే ఇక్కడ తో ఆపేసి, "fridge " దగరకి వెళ్ళాలి .... ... సశేషం

No comments: